జెన్ జీ లక్ష్యంగా టీఆర్ఎస్ ముందుకు వెళుతుంది.. కాంగ్రెస్‌ను గద్దె దించుతాం: కల్వకుంట్ల కవిత
- ఇకపై తెలంగాణ జాగృతి ఎన్జీవోగా పని చేస్తుందన్న కవిత
- తెలంగాణ ఉద్యమకారుల కోసం లక్ష సూపర్ న్యూమరికల్ ఉద్యోగాలను క్రియేట్ చేస్తామని హామీ
- రేవంత్ ఇక్కడ ఉన్నా.. సిమ్ కార్డు ఢిల్లీలో ఉంటుందని ఎద్దేవా
తెలంగాణ జాగృతి సంస్థ ఇకపై ఎన్జీవోగా పనిచేస్తుందని, తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) జెన్ జీ యువతే లక్ష్యంగా ముందుకు వెళ్తుందని ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వెల్లడించారు. బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, ప్రస్తుత ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూనే తమ పార్టీ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు.
తెలంగాణ ఉద్యమకారులను గౌరవించుకునే క్రమంలో లక్ష సూపర్ న్యూమరికల్ ఉద్యోగాలను క్రియేట్ చేస్తామని కవిత హామీ ఇచ్చారు. అలాగే ‘పాంచజన్యం’ పేరుతో ప్రజల్లోకి వెళ్తామని, సర్వోదయ తెలంగాణే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఎంతటి పెద్ద జబ్బు చేసినా పేదలకు నాణ్యమైన వైద్యం, విద్యను పూర్తిగా ఉచితంగా అందించడమే తమ విధానమని స్పష్టం చేశారు.
ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల రైతులు ధాన్యం కుప్పలపైనే ప్రాణాలు విడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం వస్తే రైతులకు ధాన్యం అమ్ముకునే విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని భరోసా ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నా, ఆయన సిమ్ కార్డు మాత్రం ఢిల్లీలో ఉందని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని... మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌లు, ఓవర్ సీస్ స్కాలర్‌షిప్‌ల గురించి సీఎం ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. సెక్రటేరియట్‌లో దివ్యాంగుల కోసం కనీస సౌకర్యాలు లేకపోవడం ప్రభుత్వ అలసత్వానికి నిదర్శనమని మండిపడ్డారు.
సాధారణ పరిస్థితుల్లో 800 రోజులు, బోనస్ రోజులు కలిపితే మరో 1000 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయని.. ఈ వెయ్యి రోజులు కాళ్లకు బలపం కట్టుకుని తిరుగుతామని కవిత ప్రకటించారు. కాంగ్రెస్‌ను గద్దె దించడమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తామని చెప్పారు.